కనుచూపు మేరలో కడలి. ఆరాటంగా వచ్చే కెరటాలను ఆప్యాయంగా హత్తుకునే తీరం. విశాఖ అనగానే గుర్చొచ్చేవి ఇవే. అయితే ఆటవిడుపు కోసం బీచ్‌కు వస్తున్న ఎందరో ‘అల’జడికి ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో స్థానికుల కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులే ఎక్కువగా ఉంటున్నారని చెబుతున్నారు ‘జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ’ సైంటిస్టు ఇన్‌చార్జి వీఎ్‌సఎన్ మూర్తి. విశాఖ బీచ్ అంత సురక్షితం కాదంటున్న ఆయన ‘నవ్య’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.
సముద్రాన్ని చూడగానే పెద్దలు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. అలలతో పోటీగా ఆటల్లో మునిగిపోతారు. అయితే విశాఖ బీచ్‌లో ఇలాంటివి చేస్తే ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నట్టే. మచిలీపట్నం దగ్గర సముద్రంలో చాలా దూరం వెళ్తేగాని లోతుండదు. విశాఖలో అలాకాదు. ఆర్కే బీచ్ దగ్గర లోనికి వెళ్లీ వెళ్లగానే లోతుంటుంది. లాసన్స్‌బే, కైలాసగిరి దగ్గర నీళ్లలో కొంత దూరం వరకు వెళ్లవచ్చు. ఆర్కే బీచ్‌కు దక్షిణ, ఉత్తరం వైపు రెండు నుంచి మూడు మీటర్ల లోతుంటుంది. కొన్నాళ్లుగా కోత ప్రభావంతో లోతు మరింత పెరుగుతోంది. సముద్రం తీరం దిశగా వస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
అత్యుత్సాహం వద్దు..
విశాఖ బీచ్ ఈతకు అసలు సురక్షితం కాదు. గోవా దగ్గర సముద్రంలో దాదాపు కిలోమీటర్ దూరం వరకు నడిచి వెళ్లవచ్చు. విశాఖలో పది మీటర్లు లోనికి వెళ్తే చాలు లోతు పెరిగిపోతుంది. లోతును అంచనా వేయలేక చాలామంది సముద్రంలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. స్థానికులకు కొంత అవగాహన ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి పరిస్థితుల గురించి తెలియక నీళ్లలోకి దిగుతుంటారు. మోకాళ్ల లోతు వరకు వెళ్తే ఫర్వాలేదు. అత్యుత్సాహంతో లోనికి వెళ్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. అందుకే విశాఖ వచ్చే పర్యాటకులు బీచ్‌కు వెళ్లామా.. చూశామా.. వచ్చామా.. అన్నట్టు వ్యవహరించాలి.
వెనక్కి వెళ్లే సమయంలో..
బీచ్‌లున్న ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువే. విశాఖలో ఏటా 30 నుంచి 50 మంది వరకు నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువగా యువకులు, మద్యం సేవించిన వారు ఉంటున్నారు. ఆర్కే బీచ్ దగ్గర లోతుతో పాటు ఇసుకు కొంత లూజ్‌గా ఉంటుంది. సముద్రంలోకి దిగినప్పుడు కెరటం వెనక్కి వెళ్లే సమయంలో ఇసుక ఎక్కువగా జారిపోతుంటుంది. లోతు ఎక్కువగా ఉండటంతో కాళ్లు పట్టు కోల్పోయి మనిషి నీళ్లలో మునిగిపోతాడు. అలాగే రాళ్లు ఎక్కువగా ఉండే కురుసుర, భీమిలి వంటి ప్రాంతాల్లో అలల తాకిడికి ఒక్కసారిగా కిందపడటంతో తలకు రాళ్లు తగిలి స్పృహ కోల్పోతుంటారు. అదే సమయంలో వెనక్కి వెళ్తున్న అలలతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోతుంటా. గత తొమ్మిదేళ్లలో దాదాపు 350 మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల ఈ ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
ఇసుక కావాలి..
అలల తీవ్రతకు తీరం కోతకు గురువతుంటుంది. దీన్ని ఎవరూ ఆపలేరు. గ్లోబలైజేషన్ ప్రభావం, సముద్ర నీటి మట్టాలు పెరగడం, ఇసుక కొరత.. తదితర కారణాలతో తీరం ప్రమాద స్థాయిలో కోతకు గురవుతోంది. ఇక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో కెరటాలు బలంగా వస్తుంటాయి. దీంతో కోత తీవ్రంగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే ఇక్కడ పెద్దఎత్తున ఇసుక డిపాజిట్ చేయాలి. డాల్ఫిన్‌నోస్ సమీపంలో డిపాజిట్ అయిన ఇసుకను పోర్టు యాజమాన్యం పంపింగ్ ద్వారా ఆర్కే బీచ్ దగ్గర డంపింగ్ చేస్తోంది. అయితే సీజన్ బట్టి కాకుండా ఏడాది పొడవునా జరగాలి. ఇసుక కొరతను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.
హై టైడ్.. లో టైడ్..
సముద్ర కెరటాలే ప్రమాదాలకు ప్రధాన కారణం. హై టైడ్.. లో టైడ్ సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ రెండింటి మధ్య 12 గంటల వ్యత్యాసం ఉంటుంది. లోటైడ్ ప్రమాదకరమైనది. ఎలా అంటే.. సముద్రంలో నీటి మట్టం తగ్గినపుడు.. కొంత దూరంలోనే లోతు ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో అలలు వెనక్కి వెళ్లినపుడు.. అక్కడున్నవారు అమాంతంగా నీళ్లలోకి జారిపోతారు. హై టైడ్ సమయంలో నీటి మట్టం పెరుగుతుంటుంది కాబట్టి కొంచెం ఫర్వాలేదు. ఈ రెండింటి సమయాలను ప్రతి రోజూ బీచ్‌లో డిస్‌ప్లే చేయాలి. ఈ సమయాలను భారత వాతావరణ విభాగం ఏటా డిసెంబర్‌లోనే ముద్రిస్తుంది. వాతావరణ వివరాలు ఎలాగైతే ప్రతి రోజూ తెలియజేస్తున్నామో..! అదే మాదిరిగా.. ప్రతి రోజూ హై టైడ్, లో టైడ్ వేళల వివరాలను నిత్యం అందించాలి. వీటిపై పర్యాటకులకు అవగాహన కల్పించాలి. దీనివల్ల ప్రమాదాలను కొంతవరకు నివారించవచ్చు.
నిఘా పెంచాలి..
సముద్ర తీరం వైజాగ్‌కు ఓ వరం. బీచ్‌ను చూడటానికే పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. భవిష్యత్తులో పర్యాటకంగా విశాఖ కీలకం కానున్న నేపథ్యంలో పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో బీచ్‌ను కాపాడుకోవడంతో పాటు పర్యాటకులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృత్రిమంగా సముద్రం లోపల కెరటాల నిలువరించడానికి చర్యలు తీసుకోవాలి. బీచ్‌లో నిరంతర నిఘా ఉండాలి. కోస్టల్ బ్యాటరీ నుంచి పార్కు హోటల్ వరకు దాదాపు రెండు కిలోమీటర్లు పోలీసులు, గజ ఈతగాళ్లు, బోట్లు ఏర్పాటు చేయాలి. గజ ఈతగాళ్లకు షిఫ్ట్ డ్యూటీలు వేయాలి. ఇవన్నీ చేసినప్పుడే బీచ్ అందాలు చూడటానికి వచ్చిన పర్యాటకులు ఇక్కడి నుంచి ఆనందాన్ని మూటగట్టుకుని వెళ్తారు.
ఎంతో మార్పు..
1977లో ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేయడానికి వచ్చినప్పుడు బీచ్ విశాలంగా ఉండేది. రోడ్డు నుంచి లోనికి దిగి.. కొంతదూరం నడిచి వెళ్లేవాళ్లం. అధ్యాపకులు మమ్మల్ని తీసుకుని బీచ్‌లో అధ్యయనం చేపట్టేవాళ్లు. బీచ్‌లో సర్గోసీ వంటి మొక్కలు అనేక జాతులు ఉండేవి. వాటి వల్ల కోత తగ్గేది. ఇప్పుడు బీచ్ స్వరూపమే మారిపోయింది. ఆ మొక్కలు బీచ్ అంతా వెతికినా కనిపించడం లేదు.
0 comments:
Post a Comment