- విద్యార్థులను ప్రశ్నించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ
- మరో ఇరువురి ప్రమేయంపై ఆధారాలు సేకరించిన పోలీసులు
- ఫోరెన్సిక్ ల్యాబ్‌కు బాధితురాలి, నిందితుల సెల్‌ఫోన్‌లు
నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి కేసును ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతోంది. ఈ కేసులో పోలీస్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. మరోవైపు.. ఈ ఉదంతంపై ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ బుధవారం నుంచి రెండో దఫా విచారణ ప్రారంభించింది.
గత నెల 29 నుంచి 31 వరకు ఈ కమిటీ తొలి దఫా విచారణ జరిపిన సంగతి తెలిసిందే. తొలిదశలో ఈ కమిటీ పోలీస్, రెవెన్యూ, వర్సిటీ ఉన్నతాధికారులను, విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు, అధ్యాపకులు, వసతి గృహ వార్డెన్‌లు, ఇతర సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. బుధవారం నుంచి విద్యార్థులను.. ముఖ్యంగా ఆర్కిటెక్చర్ విద్యార్థులందర్నీ ప్రశ్నిస్తామని బాలసుబ్రహ్మ ణ్యం తెలిపారు.
ముఖ్యంగా రిషితేశ్వరికి చెందిన డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డైరీలో ఆమె రాసుకున్న వివరాలను బట్టి బాధితురాలు అత్యంత సున్నిత మనస్కురాలని భావిస్తున్నారు.
వర్సిటీలో ర్యాగింగ్‌తో పాటు సీనియర్లు లైంగిక వేధింపులకు, వికృత చేష్టలకు పాల్పడినట్లు ఇప్పటికే పోలీస్ అధికారులు నిర్థారించారు. ఈ క్రమంలోనే తన బాధ తల్లి దండ్రులకు చెబితే వారు ఎక్కడ బాధపడతారోనని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. గత నెల 14న క్యాంప్‌సలోని తన వసతి గృహంలో ఉరి వే సుకుని ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి.. సూసైడ్ నోట్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
ఈ మేరకు.. ఆమె ఆత్మహత్య చేసుకున్న రెండు రోజుల్లోనే తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం టొల్లంగిపేటకు చెందిన నరాల శ్రీనివాస్, ఖమ్మం జిల్లా అంజనాపురానికి చెందిన జయచరణ్, గుంటూరు జిల్లా కనగాలకు చెందిన అనిషా నాగ సాయిలక్ష్మిలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మరో ఇద్దరు సీనియర్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వారిని కూడా అరెస్ట్ చేయనున్నారు. కాగా.. రిషితేశ్వరిని ఆమె సీనియర్లు గదిలో అర్ధనగ్నంగా తిప్పుతూ ఫొటోలు తీశారనే వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసులకు ఆధారాలు లభించలేదు. ఒకవైపు రిషితేశ్వరి కేసుపై అనేక ఆరోపణలు వస్తున్న తరుణంలో.. కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు కొద్ది నెలల క్రితం ఫ్రెషర్స్ ఏర్పాటు చేసిన పార్టీలో చిందులు వేసిన దృశ్యాలు బహిర్గతం కావడంతో ఈ కేసు వ్యవహారం మరింత వివావాస్పదమైంది.
తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. కమిటీ విచారణ జరుపుతుండగానే ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. అప్పుడే ఆయనను సస్పెండ్ చే స్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.
అయితే ఆయన డ్యాన్స్ చే స్తున్న వీడియో క్లిప్పింగులను యాజమాన్యానికి ఇవ్వకుండా మీడియాకు విడుదల చేశారనే కారణంతో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డేవిడ్‌రాజును ఉద్యోగంలోంచి తొలగించారు. కేసులో ప్రిన్సిపాల్ ప్రమేయంపైనా విచారణ జరుపుతున్నారు. రిషితేశ్వరి సెల్‌ఫోన్‌తోపాటు నిందితుల సెల్‌ఫోన్లనూ సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
0 comments:
Post a Comment