- పచ్చదనం పెంపు లక్ష్యంగా ఉమఅమరేశ్వరి కృషి
- ‘గ్రీన్ ఇనిషియేటివ్’ ద్వారా ప్రజల్లో చైతన్యం
- గ్రామం దత్తతతో నలుగురికీ ఆదర్శం
పట్టణాలు, నగరాలు పక్షుల కిలకిలరావాలతో కళకళలాడుతూ ఉండాలన్నది ఆ అధ్యాపకురాలి కోరిక. ప్రతి ఇంటి ఆవరణను అందమైన పువ్వులు విరబూసే మొక్కలతో నింపాలన్న ఆశ. వీధులన్నీ పచ్చదనంతో నిండి హరితవనాన్ని తలపించాలన్న తపన. తన కల సాకారానికి నడుం బిగించిందామె. మొదట ఒంటరిగా పోరాటం మొదలు పెట్టినా, ఆపై ‘గ్రీన్ ఇనిషియేటివ్’ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. శక్తికి మించిన పనైనా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, దానిని గ్రీన్‌కార్పెట్‌లా మార్చేందుకు మదనపల్లె పట్టణానికి చెందిన ఉమఅమరేశ్వరి నిరంతరం కృషి చేస్తున్నారు. పచ్చదనం పెంపును ప్రవృత్తిగా స్వీకరించి నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మదనపల్లె పట్టణానికి చెందిన ఉమఅమరేశ్వరికి చిన్నప్పటి నుంచే మొక్కలంటే ప్రాణం. దీంతో ఎస్వీయూలో ఎమ్మెస్సీ(బోటనీ) పూర్తి చేసి అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ చేతుల మీదుగా గోల్డ్మెడల్ అందుకున్నారు. ఆపై ఎంఫిల్ పూర్తి చేసి, మల్చింగ్, జీవామృతం, పంచగవ్య విధానంలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టా కూడా పొందారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాలలో పార్ట్టైమ్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన ఆమె ఏ ఫంక్షన్కు వెళ్లినా మొక్కలను బహుమతిగా ఇస్తుంటారు. డీఎస్సీలో ప్రతిభ చూపి ఎస్జీటీగా, ఈవోఆర్డీ పోస్టుకు ఎంపికైనా తనకు ఇష్టమైన అధ్యాపకురాలి వృత్తినే స్వీకరించారు. బోటనీ లెక్చరర్గా పనిచేస్తూ, తన మనసులోని ఆలోచనలకు విద్యార్థుల ద్వారా క్రియాత్మక రూపం ఇస్తున్నారు. ఇంటి ఆవరణనే వనంగా మార్చి.. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సంకల్పంతో ఉమఅమరేశ్వరి తన ఇంటి ఆవరణను ఓ హరితవనంగా మార్చారు. దాదాపు 30 రకాల మొక్కల పెంపకంతో పచ్చదన కార్పెట్లా ఉండేలా రూపుదిద్దారు. గ్రీన్పీస్ సొసైటీ సభ్యురాలైన ఉమ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్గా పచ్చదనం పెంపకానికి సంబంధించి అన్ని మెళకువలు నేర్చుకున్నారు. మొక్కలు పెంపకం, పుస్తకాలు చదవడే హాబీగా పెట్టుకుని తనదైన లోకంలో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మనసులోని ఆలోచనలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు మండలంలోని పొన్నూటిపాళెం పంచాయతీ ఎగువకురవంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ‘గ్రీన్ ఇనిషియేటివ్’ కార్యక్రమం ద్వారా స్థానిక సర్పంచ్ యశోదమ్మ, స్నేహితురాలు వైదేహి సహకారంతో ‘ఇంటికో చెట్టు... సంరక్షణే తొలి మెట్టు’ అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నారు. మొక్కల పెంపకాన్ని ఓ ఉద్యమంలా చేపట్టి, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గృహిణులు, యువతను ఇందులో భాగస్వామ్యులను చేస్తున్నారు. సినిమాలు, షికార్లకు దూరంగా ఆదివారం గ్రామానికి వెళ్లి పచ్చదనం పెంపుపై ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా పిచ్చుకలు, పక్షులు, సీతాకోకచిలుకలను ఆకర్షించే హెమిలియా మొక్కల పెంపకంపై దృష్టి సారించారు. పక్షుల కిలకిలరావాలు నగరాలకు దూరమవుతున్న పరిస్థితి నుంచి బయట పడాలని తపిస్తున్నారు. వాటిని నగరం ముంగిటకు రప్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. మరోవైపు సేంద్రీయ వ్యవసాయంపై ఎక్కడ సదస్సు జరిగినా వాటిలో పాల్గొని ప్రసంగిస్తుంటారు. దీనికి సంబంధించి పలు వ్యాసాలు రాయగా, అవి అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. పచ్చదనం పెంపు, తాను దత్తత తీసుకున్న గ్రామం పదేళ్ల తరువాత హరితవనంలా చూడాలన్న ఉమఅమరేశ్వరి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.
0 comments:
Post a Comment