‘‘నాన్న ఏ విషయాన్నైనా సూటిగా, నిజాయితీగా చెబుతారు. నా సినిమాల విషయంలో వ్యకిగతంగా ఎప్పుడూ ప్రశంసించరు. ‘శ్రీమంతుడు’ సినిమా చూసొచ్చి ‘నీ కెరీర్ బెస్ట్ సినిమా ఇది. ఇప్పటి వరకు పెర్‌ఫార్మెన్స్‌లో కూడా ఇదే బెస్ట్’ అని నాన్న చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది.
ఆ క్షణంలో కళ్లల్లో నీళ్లు తిరిగాయి’’ అని మహేశ్‌బాబు అన్నారు. ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో మహేశ్‌బాబు మాట్లాడారు.
‘‘పదిహేనేళ్ల కెరీర్‌లో ఈ ఆగస్ట్ 7వ తేదిని ఎప్పటికీ మరువలేను. నాన్న అన్నట్టుగా నా కెరీర్ బెస్ట్ సినిమా ఇది. సినిమా చూసిన చాలామందికి తమ ఊరి కోసం ఏదొకటి చెయ్యలనే ఆలోచన రావడం ఎంతో ఆనందానిచ్చింది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ప్రీ క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తునప్పుడు నాకు సలహా ఇస్తూ జగపతిబాబుగారు కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇచ్చిన సన్నివేశాన్ని స్వేచ్చగా మనసు పెట్టి చేశానంతే. షూటింగ్ ప్రారంభంలో ‘దర్శకత్వం అంటే కథ చెప్పడమే కదా సార్’ అని శివ అన్నారు. ఆ మాట ఎంతో ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సినిమా పట్ల ఆయనకున్న క్లారిటీ ఏంటో తెలిసింది. ‘పోకిరి’ సినిమాలో లుంగీలో కనిపించా. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో బలవంతంగా లుంగీ వేయించాలని చూశారు. నేను అంగీకరించలేదు.
ఈ సినిమాకు అది అవసరం అని శివగారు చెప్పారు. ఓకే అనేశా. లుంగీ ధరించడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. ఈ సినిమా రెండో షెడ్యూల్ జరుగుతుండగా మా బావ గల్లా జయదేవ్ మా ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకుంటే బావుంటుందనీ, ఓసారి ఆలోచించమనీ అన్నారు. ఆ టైమ్‌లో అయితే సినిమా పబ్లిసిటీ కోసం చేశారనుకుంటారని ఏమీ మాట్లాడలేదు. మా ఊరిని దత్తత తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది. మూడు నెలల్లో దానిపై ఓ క్లారిటీకి వస్తాను. ప్రేక్షకులు మంచి సినిమా కోరుకుంటారు. వాళ్లకు మనం క్వాలిటీ సినిమా ఇచ్చాం అంటే బాక్సాఫీ్‌సకు ఆకాశమే హద్దు అవుతుంది. మంచి సినిమా అనుకున్నప్పుడు కలెక్షన్ల స్టామినా గురించి ఆలోచించకూడదు. అలా చేస్తే ఆ కథకు గౌరవమిచ్చినట్లు కాదు. ఈ సినిమాతో నటుడిగా చాలా గౌరవాన్ని సంపాదించకున్నాను. మల్టీస్టారర్ సినిమాలకు నేనెప్పుడూ రెడీగానే ఉంటాను. మంచి కథ కుదిరితే పవన్‌కల్యాణ్ గారితో సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నాను. నా సినిమాలు చూసి ఎప్పుడూ స్పందించని మా అన్నయ్య మొదటిసాకి ఫ్లవర్ బొకే ఇచ్చి ప్రశంసించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక మా పెద్దోడు (హీరో వెంకటేశ్) సినిమా చూసొచ్చి ‘ఎక్కడున్నావ్ అర్జంట్‌గా కలవాలి’ అంటూ ఫొన్ చేశారు. ఇంటికొచ్చి సినిమా గురించి గంటపాటు మాట్లాడారు. మామూలుగా మా గౌతమ్ నా సినిమాలు అంతగా చూడడు. కానీ ఈ సినిమా థియేటర్‌లో చూసి ‘బావుంది నాన్న’ అన్నాడు. సితార అయితే పాటలు ఫుల్‌గా పాడుతుంది. ఆ లిరిక్స్ నాకు కూడా గుర్తులేవు. తను అన్ని గుర్తు పెట్టుకుంది.
కొరటాల శివ మాట్లాడుతూ ‘‘హర్ష క్యారెక్టర్‌ను చాలా సింపుల్‌గా డిజైన్ చేశాను. మిలియనీర్ అబ్బాయి సైకిల్ తొక్కుతుంటే చాలా బావుంటుందనిపించింది. అందుకు మా ఊర్లో చూసిన కొన్ని సంఘటనలు స్ఫూర్తి. కథను నేను ఎంతగా నమ్మానో మహేశ్‌బాబు కూడా అంతే నమ్మారు. పాజిటివ్ మైండ్‌తో పని చేస్తే సక్సెస్ పాజిటివ్‌గా ఉంటుంది అనడానికి ‘శ్రీమంతుడు’ ఒక ఉదాహరణ’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment