- ముసుగేసి కొట్టిన సీనియర్లు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని కాలేజీ యాజమాన్యం
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు! కళ్లనిండా కోటి కలలతో.. కొత్త ఆశలతో.. కళాశాలలో చేరిన పదహారేళ్ల కుర్రాడు.. సీనియర్లు పెట్టిన హింసను తట్టుకోలేక, కాలేజీకి వెళ్లడానికి కూడా భయపడి చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. అనంతపురం జిల్లా ఓబుళదేవచెరువు మండలం దొన్నికోటవారిపల్లికి చెందిన బ్రహ్మానందరెడ్డి, రాజమ్మల కుమారుడు మధువర్ధన్రెడ్డి(16). పదో తరగతిలో అత్యుత్తమ గ్రేడ్ సాధించిన మధువర్ధన్ను అతడి తల్లిదండ్రులు నెల్లూరులోని శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో చేర్పించారు. అయితే, జూలై11న సీనియర్ విద్యార్థులు అతణ్ని ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలు పెట్టారు. ముసుగు కప్పి చితక బాదారు. ఈ విషయాన్ని అతడు తల్లిదండ్రులకు ఫోన్లో తెలియజేసి బాధపడ్డాడు. దీంతో వారు అతడిని ఇంటికి పిలిపించుకున్నారు. జూలై 28న కళాశాలకు వెళ్లి సిబ్బందికి, ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో ఇక తాను ఆ కళాశాలకు వెళ్లలేనని మధువర్ధన్రెడ్డి చెప్పడంతో.. తల్లిదండ్రులు హైదరాబాద్కు వెళ్లమన్నారు. ఇంతలోనే.. గురువారం సాయంత్రం కళాశాల వారు ఫోన్ చేసి మధువర్దన్ను కాలేజీకి పంపాలని చెప్పారు. వారితో మాట్లాడిన అనంతరం మధువర్ధన్ పొరుగున ఉన్న వీర ఓబునపల్లికి వెళ్లి ఉతికిన బట్టలు తెచ్చుకుంటానని చెప్పి బయటకు వెళ్లాడు. పొద్దుపోయినా ఇంటికి చేరలేదు. శుక్రవారం ఉదయం తోట వద్ద అతడి ద్విచక్ర వాహనం ఉన్న విషయాన్ని కొందరువిద్యార్థులు గుర్తించి సమాచారమిచ్చారు. అక్కడికెళ్లి చూడగా మధువర్ధన్ మామిడిచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మండిపడ్డ విద్యార్థులు..
మధువర్ధన్ ఆత్మహత్యతో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ర్యాగింగ్ వల్లే ఉసురు తీసుకున్నాడని మండిపడుతూ నెల్లూరుజిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని గాయత్రి జూనియర్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగాయి. కాగా, ఈ మృతితో తమ కళాశాలకు సంబంధం లేదని ప్రిన్సిపాల్ కిరణ్ చెప్పడంతో అధ్యాపకులతో విద్యార్థి నేతలు వాగ్వాదానికి దిగారు. కళాశాల రిసెప్షన్ గది కిటికీ అద్దాలు పగులగొట్టారు. కంప్యూటర్ను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మధు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment