తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస రెడ్డి కార్యాలయంలో జరిగిన సెటిల్‌మెంట్ ‘హింసాత్మకం’గా మారింది. ఒక మహిళకు అప్పు ఇచ్చిన వ్యక్తులపై శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేశారు. బాధితుల్లో ఒక వ్యక్తి బ్లేడుతో మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు, పోలీసు వర్గాల కథనం ప్రకారం... మయూరి టక్కర్ అనే మహిళ తల్వార్ శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా నవీన్, సుధీర్ అనే ఇద్దరితో పరిచయం పెంచుకుంది. తాను పెద్ద పారిశ్రామికవేత్తనని వారిని నమ్మించింది. వారి నుంచి రూ.5 లక్షలు అప్పుగా తీసుకుంది. దీనికి నెలనెలా వడ్డీ కడుతూ వారిలో భరోసా కల్పించింది. ఆ తర్వాత... పరిశ్రమ విస్తరణ కోసం మరో రూ.50 లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరింది. అంత డబ్బు తమవద్ద లేదంటూ... నవీన్, సుధీర్ కలిసి మయూరికి తొమ్మిది నెలల క్రితం రూ.38 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోపు తిరిగి చెల్లిస్తానని ఆమె లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. గడువు దాటినా ఆమె డబ్బులు చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వచ్చేది. మరోవైపు నవీన్, సుధీర్‌లు వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో డబ్బులు చెల్లించాలని ఆమెపై ఒత్తిడి పెంచారు. అయితే... ఆమె ఎదురుదాడికి దిగింది. తన వ్యాపార భాగస్వామి దీపక్ ద్వారా నవీన్, సుధీర్‌లను బెదిరించింది. నాకు ముఖ్యమంత్రి తెలుసు, హోంమంత్రి తెలుసునని వారిని హెచ్చరించింది. ఈ క్రమంలో... విషయాన్ని సెటిల్ చేసుకుందామంటూ శుక్రవారం సాయంత్రం హోంమంత్రి అల్లుడు శ్రీనివాస రెడ్డి ఆఫీసుకు రావాలని వారికి చెప్పింది. దీంతో... నారాయణగూడ లింగంపల్లిలోని ప్రగతి ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న శ్రీనివాసరెడ్డి కార్యాలయానికి నవీన్, సుధీర్ చేరుకున్నారు. వచ్చీ రాగానే శ్రీనివాస్ రెడ్డి అనుచరులు తల్వార్లతో వీరిపై దాడి చేశారు. దీంతో భయపడిపోయిన సుధీర్ పరుగెత్తుకుంటూ అపార్ట్‌మెంట్ కిందకు వచ్చి... గేటు వద్ద బ్లేడుతో గొంతుకోసుకొని కింద పడిపోయాడు. ఇది గమనించిన అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుధీర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఇక... నవీన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. గతంలో ఇదే అపార్ట్‌మెంట్‌లో నాయిని నివసించేవారు. ఇప్పుడు ఈ ఫ్లాట్‌ను శ్రీనివాస రెడ్డి తన కార్యాలయంగా మార్చుకున్నారు. చిన్నపాటి పంచాయతీల నుంచి బడా సెటిల్‌మెంట్ల వరకు ఈ ఫ్లాట్ అడ్డాగా మారినట్లు ఆరోపణలున్నాయి. శుక్రవారం జరిగిన సంఘటన బయటికి పొక్కకుండా చూడాలని భావించినా... సుధీర్ ఆత్మహత్యాయత్నంతో విషయం బయటపడింది. ప్రస్తుతం నవీన్‌పై దాడి, సుధీర్ ఆత్మహత్యాయత్నంపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని నారాయణగూడ పోలీసులు తెలిపారు. స్వయానా హోంమంత్రి అల్లుడికి సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
Watch::
0 comments:
Post a Comment