- 1000 పదాలతో వ్యాసం కూడా రాసి పంపాలి
- అది నచ్చితేనే ఆస్తి..
- యూఎస్ దంపతుల వినూత్న ఆఫర్
అక్షరాలా 6 లక్షల డాలర్ల విలువ చేసే 35 ఏకరాల ఫా మ్ హౌస్. మన రూపాయల్లో చెప్పాలంటే.. రూ.3.83 కోట్లు. అమెరికాలోని వర్జీనియాకి చెందిన రాండీ సిల్వర్స్, కారొలిన్ బెర్రీ దంపతుల ఆస్తిది. అంత విలువై న ఆస్తిని 200 డాలర్లకు(రూ.13,000), 1000 పదాలతో రాసే వ్యాసానికి వెలకట్టి ఇచ్చేస్తామంటున్నారు. వ్యాసమేమిటీ? 200 డాలర్ల లెక్కేంటి? అనుకుంటున్నారా? దానికీ ఒక లెక్కుంది. మీకు ఆ ఫామ్‌హౌజ్‌ను కొనాలనే ఆలోచన ఉంటే.. కొన్నాక దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చెబుతూ వ్యాసం రాయాలి. అందులో అక్షర దోషాలు, అన్వయ దోషాలు, వాక్యనిర్మాణ దోషాలు ఏవీ ఉండకూడదు. అందంగా, అద్భుతంగా, భావుకతతో గొప్పగా రాయాలి. దాంతోపాటు.. ఎంట్రీ ఫీజు అనుకోండి, ఇంకేదైనా అనుకోండి.. 200 డాలర్లు ఆ దంపతుల పేరు మీద అక్టోబర్ 1లోపు అందేలా పంపాలి. అలా వచ్చిన ఎంట్రీలన్నిటిలోంచీ బాగా రాసిన 25 వ్యాసాలను ఎంపిక చేస్తారట. ఆ 25 వ్యాసాలనూ ముగ్గురు న్యాయనిర్ణేతలతో కూడిన ప్యానెల్‌కు పంపుతారు. వారు ఎంపిక చేసిన వ్యక్తే విజేత. ఆ వ్యక్తికి ఫామ్‌హౌ్‌సను రాసిచ్చేస్తారు. ఇలా చేయడం వెనుక ఈ దంపతుల మదిలో పెద్ద ప్లానే ఉంది. తమ పిలుపుతో కనీసం 5వేల మందైనా వ్యాసాలు, 200 డాలర్లు పంపుతారని వారి అంచనా. అంటే.. అక్షరాలా 10 లక్షల డాలర్లు. రూ.6.40 కోట్ల దాకా వస్తుంది. ఇది ఆ ఫామ్ హౌస్ అసలు విలువకు దాదాపు రెట్టింపు. సూపర్ ఐడియా కదూ! అంతాబానే ఉందిగానీ.. 5వేల మంది పంపకపోతే? ఇదే సందేహం సిల్వర్స్, బెర్రీలకూ వచ్చింది. వచ్చిన సొమ్ము 6 లక్షల డాలర్ల కన్నా తక్కువుంటే.. ఎవరి సొమ్మును వాళ్లకు వెనక్కు పంపేసి దాన్ని అసలు రేటుకే ఎవరికైనా అమ్మేసి చేతులు దులుపుకొంటారట ఎంచక్కా!!
0 comments:
Post a Comment