- హాస్టల్‌లో ఉరేసుకున్న బాలికలు
- యాజమాన్యమే హత్య చేసిందంటూ తల్లిదండ్రుల ఆరోపణ
- కాలేజీ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం..
- అధ్యాపకుడిపై దాడి
నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రిశితేశ్వరి ఘటన మరువనేలేదు! ఆ మరుసటి రోజే అనంతపురంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యా మరుపురాలేదు. తాజాగా, కడప నారాయణ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. అవి ఆత్మహత్యలు కాదు.. యాజమాన్యం చేసిన హత్యలేనంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీపైకి దాడికి దిగారు. ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న అధ్యాపకుడిని చావబాదారు. విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కాలేజీ ముందు ధర్నాకు దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మైదుకూరు మండలం జీవీ సత్రానికి చెందిన మాలెపాటి నందిని (16), కడప నగరానికే చెందిన చవ్వా మనీష (16) పులివెందులకు వెళ్లే మార్గంలోని నారాయణ జూనియర్ కాలేజీ క్యాంప్‌సలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే ఏమైందో.. ఏమో కానీ.. సోమవారం సాయంత్రం వారు హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఆ విషయాన్ని గుర్తించిన యాజమాన్యం.. విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారి తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు భారీ సంఖ్యలో కాలేజీకి చేరుకుని ఆందోళన చేపట్టారు. సాయంత్రం 5.30 గంటలకు చనిపోతే 7.30 గంటల వరకు కళాశాల యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను యాజమాన్యమే హత్య చేసి.. ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ నవీన్‌గులాఠీ ఘటనాస్థలానికి చేరుకుని సమీక్షించారు. అయితే విద్యార్థినుల ఆత్మహత్యలకు కారణాలు తెలియరాలేదు.
0 comments:
Post a Comment