ఆంధ్రప్రదేశ్ కు మరో అతి ముఖ్య పరిశ్రమ రానుంది. విమానాలను తయారుచేయడంలో అంతర్జాతీయ అగ్ర కంపెనీలలో ఒకటైన ప్రముఖ సంస్థ ‘ఎయిర్ బస్’ అనంతపురంలో విమానాల తయారీ పరిశ్రమల కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం గత ఆరునెలలుగా ఏపీ ప్రభుత్వం.. ఎయిర్ బస్ సంస్థల ప్రతినిథులు మధ్య అనేకమార్లు చర్చలు జరిగాయి. తాజాగా, నిన్న ప్రభుత్వం ‘ఎయిర్‌బస్’ కు అనంతపురం జిల్లా గోరంట్ల మండల పాలసముద్రం గ్రామం సమీపంలో సుమారు 50 ఎకరాలను కేటాయిస్తూ జీవో. నెం 264ను జారీ చేసింది. ఈ భూములు హైదరాబాద్-బెంగుళూరు నేషనల్ హైవేను ఆనుకొని.. అనంతపూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో, బెంగుళూరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కాగా, ఈ ప్రాజెక్ట్ నిమిత్తం ఎయిర్ బస్ సంస్థ మరో 200 ఎకరాల కావాలని ప్రభుత్వాన్ని అడుగుతోంది. ప్రస్తుతం తమ అధీనంలో ఉన్న భూమిని అప్పగించిన ఏపీ ప్రభుత్వం, చుట్టుప్రక్కల ఉన్న ప్రైవేటు భూములను కూడా ‘ఎయిర్‌బస్’కు అందించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.
యూరోపియన్ కంపెనీ అయిన ఎయిర్ బస్ దేశంలో తాము సాధించే మొదటి ప్లాంట్‌కు అనంతపురం జిల్లాను ఎన్నుకోవడం విశేషం! ‘ఎయిర్ బస్’ ప్లాంట్ ప్రారంభం కానుండటంతో అనంతపురం జిల్లా మేజర్ ఇండస్ట్రియల్ హబ్‌గా మారే సూచనలు కనపడుతున్నాయి. ‘ఎయిర్ బస్’ ప్లాంట్ పెడితే, దానికి అనుబంధంగా మరెన్నో విడిభాగాల తయారీ యూనిట్లు, లాజిస్టిక్స్ ఇండస్ట్రీ తో పాటు మరెన్నో పరిశ్రమలు తరలివస్తాయని, తద్వారా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగుపడతాయని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్‌బస్ ఏరికోరి పాలసముద్రం ప్రాంతంలోనే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం.. ఈ ప్రాంతం నేషనల్ హైవేను ఆనుకుని ఉండటంతో పాటు.. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉండటంలో అంతర్జాతీయంగా ఎగుమతి.. దిగుమతులు తేలికగా చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఆ సంస్థ సెలెక్ట్ చేసుకుంది. విభజన కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రావడం అత్యవసరం.. ఆనందదాయకం!
0 comments:
Post a Comment